పేదల ఇళ్ళ స్థలాల పేరుతో దోపిడీనా?

Update: 2020-08-20 05:32 GMT

సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ సీఎస్ కు చంద్రబాబు లేఖ

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇళ్ళ స్థలాల అవినీతి విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఇళ్లపట్టాల పేరుతో జరిగిన భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దుశ్చర్య అని విమర్శించారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనడం దుర్భరం అన్నారు. రాజానగరం(తూగో) కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు. ‘600ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించారు. ఎకరం రూ45లక్షల చొప్పున రూ 270కోట్లు ఖర్చుచేశారు. ఈ ముంపు భూములు మెరక చేయడానికి మరో రూ250కోట్లు. ఆవ భూముల్లోనే మొత్తం రూ 500కోట్ల అవినీతి కుంభకోణం. ఇళ్లపట్టాలకు భూసేకరణలో భారీగా డబ్బు చేతులు మారింది. ఇందులో అధికార వైసిపి నాయకులు భారీగా డబ్బు దండుకున్నారు.

ఆవ భూములు, చిత్తడి నేలల సేకరణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకం. భూసేకరణ ధరల్లో కూడా భారీ మాయాజాలం చేశారు. భారీగా మెరక లేపితే పరిసర గ్రామాలు నీట మునిగే ప్రమాదం. ఇటీవల గోదావరి వరదల్లో ఆవ భూములు నీట మునగడమే రుజువు. ఈ భూముల్లో పేదలకు ఇళ్లను నిర్మిస్తే వారి ప్రాణాలకే ముప్పు.పేదల ఆస్తులకు నష్టం చేస్తుంది, మరింత పేదరికంలోకి నెడుతుంది. ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ. అధికార వైసిపి నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై దోపిడి. డబ్బు దండుకోవాలనే తక్కువ ధరకు లేదా అసలు ధర లేకుండానే భూముల గుర్తింపు. మార్కెట్ ధరకు భూయజమానుల నుంచి కొని తమ పేర్లతో వైసిపి నాయకుల రిజిస్ట్రేషన్.

ఆ తర్వాత ప్రభుత్వమే దళారుల నుంచి సదరు భూముల కొనుగోళ్లు. భూసేకరణ పరిహారం, పునరావాస చట్టం 2013కింద భారీ మొత్తం చెల్లింపు తక్కువ ధర చేసే భూములను ప్రభుత్వంతో ఎక్కువ ధరకు కొనిపించినందుకు వాటాల కోసం భూయజమానులపై వైసిపి నాయకుల ఒత్తిళ్లు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ సరికొత్త అవినీతి పోకడలే. తెనాలి, వినుకొండ, కావలి, పాలకొల్లు, పెందుర్తి, చోడవరం, అద్దంకి, పెనమలూరు, అనేక నియోజకవర్గాలలో భూసేకరణలే ఈ వినూత్న అవినీతి పోకడలకు ప్రత్యక్ష సాక్ష్యాలు.’ అని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలకు భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అప్పుడే అవినీతి దృష్టాంతాలు అనేకం బైట పడతాయన్నారు.

Similar News