అమరావతితో మూడు లక్షల కోట్ల సంపద

Update: 2020-08-14 15:15 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదని..అన్ని శాశ్వత భవనాలే అని వ్యాఖ్యానించారు. అమరావతిలో 62 ప్రాజెక్టులను ప్రారంభించామని..వాటి విలువ 53 వేల కోట్లు అని తెలిపారు. అమరావతి ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయల సంపద వచ్చేదని వ్యాఖ్యానించారు. అమరావతి తరలింపు దుర్మార్గమైన చర్య అని..ప్రపంచం మెచ్చే రాజధాని కట్టాలనుకుంటే విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘అన్ని జిల్లాలకు సమదూరం అమరావతి. సంపద సృష్టి కేంద్రం. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు. రైతులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు. ఇవన్నీ ఆమోదయోగ్యం కానేకాదు. కోవిడ్ నిర్లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేశారు. అమరావతి తరలింపుతో మరింత దిగజార్చుతున్నారు.

ఓటేసింది ప్రజల కష్టాలు తీర్చటానికా? లేక కష్టాల్లోకి నెట్టడానికా? ఆ రోజు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు. పదేపదే నమ్మించి మోసం చేశారు’ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు రాజధానిగా ఆమోదం తెలిపిన ప్రాంతం అమరావతి. అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కూడా. చెన్నై, బెంగుళూరుకు నీటి సమస్య ఉంది. అమరావతికి ఆ కొరత లేదు. ఐదు జాతీయ రహదారుల్ని కలిపే ప్రాంతం అమరావతి. నవ నగరాలు అమరావతిలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేశాం’ అని చంద్రబాబు తెలిపారు.

Similar News