మూడు రాజధానులకు తాత్కాలిక బ్రేక్

Update: 2020-08-04 12:36 GMT

ఆగస్టు 14 వరకూ స్టేటస్ కో కు హైకోర్టు ఆదేశం

ఏపీ సర్కారు దూకుడుకు తాత్కాలిక బ్రేక్ పడింది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఆగస్టు 14 వరకూ మూడు రాజధానుల వ్యవహారం ఎక్కడికి అక్కడే ఆగిపోనుంది. ఇటీవలే ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రభుత్వం ఈ మేరకు గెజిట్లు జారీ చేసింది. ఈ బిల్లులపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా గవర్నర్ మాత్రం న్యాయనిపుణుల సలహా తీసుకున్న అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతోపాటు సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదముద్ర వేశారు. అప్పటి నుంచి అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు చేస్తున్నారు.

అంతే కాదు..భూములు ఇఛ్చిన రైతులతోపాటు మరికొంత మంది ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించి వీటిపై స్టే విధించాలని కోరారు.. ఈ పిటీషన్లను విచారించిన హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు తమకు పది రోజుల సమయం కావాలని ప్రభుత్వ తరపు లాయర్ కోరారు. దీంతో హైకోర్టు ఈ బిల్లుల అమలుపై స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది. దీంతో రాజధాని వ్యవహారం మరోసారి ఉత్కంఠగా మారింది.

Similar News