అమరావతిలో చంద్రబాబు ఇల్లు ఎక్కడ?

Update: 2020-08-03 13:22 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి అంత ప్రేమ ఉంటే అమరావతిలో ఎందుకు ఇళ్లు కట్టుకోలేదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అమరావతిలో ఇల్లు కట్టుకోలేదుకానీ..హైదరాబాద్ లో మాత్రం 50 నుంచి 100 కోట్లతో ఇంద్రభవనం కట్టుకున్నారని ఆరోపించారు. అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని తొలగిస్తున్నట్లు ప్రచారం చేయటం ఏ మాత్రం సరికాదన్నారు. మూడు రాజధానులు వద్దంటున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కూడా అనిల్ వ్యాఖ్యానించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఏమి మాట్లాడాలో కూడా తెలియటం లేదన్నారు. పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడు ఎవరితో ఉంటారో ఆయనకే తెలియదు? అని వ్యాఖ్యానించారు. అమరావతిని మార్చడం లేదు. మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతికి ప్రాధాన్యం తగ్గదు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయం అని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు ఇంత గగ్గోలు పెట్టలేదు. ఎనిమిది నెలలుగా చంద్రబాబు రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు అని అనిల్ విమర్శించారు.తమ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు మళ్ళీ 2024లో మళ్ళీ తీర్పు ఇస్తారని అన్నారు.

Similar News