అంత రహస్యంగా కూల్చివేతలు ఎందుకు?

Update: 2020-07-24 12:52 GMT

మీడియాను అనుమతించకపోవటంతో మరిన్ని అనుమానాలు

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి మీడియా కవరేజ్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కూల్చివేతలు అంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. వేల కోట్ల రూపాయల అనంతపద్మనాభ స్వామి ఆలయం సంపదనే లైవ్ లో చూపించగాలేనిది సచివాలయం కూల్చివేతలకు అనుమతిస్తే ఏమి అవుతుందని ప్రశ్నించింది. సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు మీడియాను అనుమతించలేమని..కోవిడ్ బులెటిన్ల తరహాలో దీనికి కూడా బులెటిన్లు విడుదల చేస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు.

పనిచేసే వారు తప్ప అక్కడ ఎవరూ ఉండకూడదన్నారు. అయితే ఏ నిబంధనల ప్రకారం అనుమతించకూడదో చెప్పాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను కోరింది. జీ బ్లాక్ కింద నిజాం నిధి ఉన్నట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. సచివాలయం చుట్టుపక్కల ప్రైవేట్ ప్రాంతాల్లోకి కూడా మీడియాను అనుమతించటంలేదని తెలిపారు. మీడియాను అనుమతించం అనటం వల్లే కూల్చివేతలపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. శనివారం నాడు ఈ అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

Similar News