జగన్ సీఎం..సుబ్బారెడ్డి ఛైర్మన్..అయినా వాళ్ళు చంద్రబాబు మాట వింటున్నారా?!

Update: 2020-07-16 08:47 GMT

రమణదీక్షితుల వివాదస్పద ట్వీట్

రమణదీక్షితులు ఒకప్పటి తిరుమల ప్రధాన ఆర్చకులు. చంద్రబాబు హయాంలో ఆయన్ను తొలగించగా...జగన్ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఓ పదవి అప్పగించారు. ఇది అంతా పాత విషయం. అయితే రమణదీక్షితులు గురువారం నాడు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ‘శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే 50మంది అర్చకుల్లో 15మంది కరోనా సోకింది. మరో 25 మంది అర్చకులకు కరోనా పరోక్ష ఫలితాలు రావాల్సి ఉంది. టీటీడీ ఈవో, ఏఈవో లు దర్శనాలు ఆపటానికి తిరస్కరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడికి చెందిన వారసత్వ అర్చక వ్యతిరేక వ్యవహారాలు, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలనే వారిద్దరూ వినయంగా అనుసరిస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి చేయిదాటిపోతుందని తెలిపారు. అంతే కాదు..ఇదే ట్వీట్ ను ఆయన సీఎం జగన్ కు కూడా ట్యాగ్ చేశారు. అంటే రమణదీక్షితులు చెప్పదలచుకున్నది ఏంటి?. ఇప్పటికీ ఇంకా ఈవో, ఏఈవోలు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఆదేశాలను పాటిస్తున్నారని చెప్పటం ద్వారా కొత్త వివాదానికి తెరతీసినట్లు అయిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

సమస్య ఉంటే ఆయన సీఎం దృష్టికో..ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించమనటం వేరు అని..అలా కాకుండా జగన్ సర్కారులో కూడా అది కూడా అత్యంత కీలకమైన టీటీడీలో చంద్రబాబు మాట ఇంకా చెల్లుబాటు అవుతుందనేలా చెప్పటం ఏమి సంకేతాలు పంపుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. తెలుగుదేశంపై బ్రాహ్మణ వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతర విమర్శల విషయంలో ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పుకోవచ్చు. అందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా టీటీడీ పరిపాలనా వ్యవహారాలను చంద్రబాబుతో లింక్ పెట్టి ట్వీట్ చేయటం ద్వారా ఆయన హద్దులు దాటినట్లే కన్పిస్తోందని చెబుతున్నారు. పూజారులకు కరోనా ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. అయితే దీనిపై ఫోకస్ పెట్టకుండా రాజకీయ విమర్శలు చేస్తే ఎవరైనా చిక్కులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు.

 

 

Similar News