ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలేవీ?

Update: 2020-07-14 08:57 GMT

 

విశాఖపట్నంలో వరస పెట్టి పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాలు జరగటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక, పరవాడ కేంద్రాల్లో వరసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఎల్.జి.పాలిమర్స్, సాయినార్ ఫార్మా ప్రమాదాలు మరవక ముందే రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన ప్రమాదం భయబ్రాంతులకు గురి చేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు? ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు? వంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదకరమైన, మండే స్వభావం గల ఆయిల్స్, రసాయనాలు నిల్వ చేస్తున్నప్పుడు రక్షణ ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలి కదా? రక్షణ ఏర్పాట్లు ఉంటే ఈ పేలుడు ఎందుకు సంభవించిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసిన అవసరం వుంది.

కర్మాగారంలో సంభవించిన పేలుడు పది కిలోమీటర్ల వరకు వినిపించిందంటే దాని స్థాయి ఊహించవచ్చన్నారు. పేలుడులో ఒకరు మృతి చెందారని, ఆరుగురు కార్మికులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిసి చాలా ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. కర్మాగారం ఆవరణలో కాలిన తీవ్ర గాయాలతో కనిపించిన మృతదేహం గత అర్ధరాత్రి నుంచి కనిపించకుండాపోయిన సీనియర్ కెమిస్ట్ కె.శ్రీనివాస్ అని తోటి వారు చెబుతున్నారు. మృతుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయిన మల్లేష్ కు మెరుగైన వైద్య సహాయం అందచేయాలని కోరారు.

Similar News