రాజధాని అమరావతి ఇక చరిత్రే

Update: 2020-07-31 11:26 GMT

మూడు రాజధానులకు లైన్ క్లియర్

పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదం

అత్యంత కీలక నిర్ణయం వెలువడింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం నాడు పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో వైసీపీ సర్కారు తలపెట్టిన మూడు రాజధానులకు మార్గం సుగమం అయింది. గవర్నర్ ఆమోదంతో బిల్లులకు చట్టబద్దత లభించినట్లు అయింది. ఇక నిర్ణయం అమలు చేయటమే తరువాయి. అయితే ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ముఖ్యంగా అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వేసిన కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్నదే ఇఫ్పుడు కీలకంగా మారింది. అయితే ఒకటి మాత్రం నిజం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని రావటం మాత్రం ఖాయం అని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెబుతున్నాయి. అమరావతిలో మాత్రం శాసన రాజదాని రానుండగా, కర్నూలు న్యాయ రాజధానిగా మారనుంది.

రాష్ట్రంలోని విపక్షాలు అన్నీ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను ఆమోదించవద్దని గవర్నర్ ను లేఖ ద్వారా కోరాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే ఈ బిల్లులు అన్నీ విభజన చట్టానికి వ్యతిరేకం అని..మండలిలో ఆమోదం పొందలేదని..సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉందని రకరకాల అభ్యంతరాలు లేవనెత్తింది. అయినా సరే గవర్నర్ హరిచందన్ న్యాయ సలహా తీసుకుని..నిపుణుల సలహా ల మేరకు కొంత సమయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎంతో ఉత్కంఠ రేపిన మూడు రాజధానుల వ్యవహారానికి లైన్ క్లియర్ అయింది.

 

Similar News