డొక్కా రాజీనామా..సీటు అంతా స్క్రిప్ట్ ప్రకారమేనా?

Update: 2020-06-24 16:00 GMT

అంతా స్క్రిప్ట్ ప్రకారమే. ఈ సంగతి డొక్కా మాణిక్యవరప్రసాద్ కు వైసీపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేయటంతో తేలిపోయింది. ఇది డొక్కా రాజీనామాతో వచ్చిన ఖాళీనే. కాకపోతే ఆయన అప్పుడు గెలిచింది టీడీపీలో. ఇప్పుడు పోటీ చేస్తుంది వైసీపీలో. మండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు రావటానికే ముందే డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఏవో కారణాలు చెప్పి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాను మళ్ళీ ఎన్నికల్లో కూడా పోటీచేయనని ప్రకటించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇఫ్పుడు మళ్ళీ అదే ఎమ్మెల్సీ సీటును డొక్కా మాణిక్యవరప్రసాద్ కు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయటంతో అంతా పక్కా పథకం ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు మండలి ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇదే వైసీపీ సర్కారు మండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ బిల్లులను అడ్డుకుంటుందనే కారణంతో రద్దుకు సిఫారసు చేసి కేంద్రానికి పంపింది. అక్కడ ఈ వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఇది ఏమి అవుతుందో ప్రస్తుతానికి ఎవరికీ క్లారిటీ లేదు. కానీ డొక్కా రాజీనామాతో ఖాళీ అయిన సీటును తిరిగే ఆయనకే ఇవ్వటం ద్వారా వైసీపీ కూడా ఒక పథకం ప్రకారమే ఆయనతో రాజీనామా చేయించిందనే విమర్శలు ఆస్కారం ఇచ్చినట్లు అయిందని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. డొక్కా మాణిక్యవరప్రసాద్ గురువారం నాడు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయనున్నారు.

 

Similar News