ఆ కరోనా పేషంట్ బిల్లు 8.5 కోట్ల రూపాయలు

Update: 2020-06-14 07:45 GMT

కరోనా వైరస్ కంటే..ఈ బిల్లు చూస్తే వేసే భయమే ఎక్కువ. ఎందుకంటే ఆ మొత్తం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు కదా?. సంపన్నులు సైతం ఆ బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఎంత సంపన్నుడు అయినా సరే అంత మొత్తంలో ఆస్పత్రి బిల్లు చూస్తే గుండె గుబేల్ అంటుంది. అయితే ఇది అంతా ఎక్కడ అంటారా?. అగ్రరాజ్యం అమెరికాలో ఓ పేషంట్ కు వేసిన బిల్లు అది. ఆ పేషంట్ వయస్సు 70 సంవత్సరాలు. ఆయన బతకటం కష్టమే అని అందరూ ఆశలు కూడా వదులుకున్నారు ఓ దశలో. కానీ వైద్యుల చికిత్సకు ఆయన శరీరం బాగా స్పందించింది. అంతే కోలుకుని ఎంచక్కా ఇంటికెళ్ళాడు. ఆ ఆనంద సమయంలో బిల్లు చూసిన ఆయనకు..ఆయన కుటుంబ సభ్యులకు ఒకింత షాక్ కొట్టినట్లు అయింది. అయితే వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే బీమా కింద ఆయన ఒక్క డాలర్ కూడా కట్టాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోయారు.

ఆయన చికిత్సకు అయిన వ్యయం 8.5 కోట్ల రూపాయలు మొత్తం సర్కారే చెల్లించనుంది. అమెరికాలోని సియాటెల్ నగరంలో నివసించే మైఖేల్ ఫ్లోర్ విషయంలో జరిగిన సంఘటన ఇది. ఆయన మార్చి 4న ఆస్పత్రిలో చేరిన తర్వాత కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. పరిస్థితి వెంటిలేటర్ వరకూ వెళ్ళింది. కానీ వైద్యుల చికిత్సతో ఆయన కోలుకుని బయటపడ్డారు. మైఖైల్ కుటుంబ సభ్యులు సైతం చావు అంచుల వరకూ వెళ్లి తిరిగి కోలుకున్న ఆయన్ను చూసి ఎంతో ఆనందించారు. అయితే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు నుంచి ఇంత భారీ మొత్తంలో తన వైద్య ఖర్చుల కోసం వ్యయం చేయాల్సి రావటం బాధగా ఉందని మైఖేల్ వ్యాఖ్యానించటం విశేషం.

Similar News