కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే

Update: 2020-06-27 12:23 GMT

ఏపీలో కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘మా ఆత్మాభిమానం దెబ్బ తినేలా ఎవరూ జాలి చూపనక్కరలేదు. మాకు గతంలో ఉన్న రిజర్వేషన్ హక్కుని పునరుద్ధరించమని అడుగుతున్నాం" అని అంటున్న కాపులకు ఏమి సమాధానం చెబుతారు? ప్రస్తుతం రిజర్వేషన్లు అమలవుతున్న ఎస్.సి., ఎస్.టి., బి.సి.లకు ఎటువంటి నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్ హక్కు పునరుద్ధరించాలని జనసేన డిమాండ్ చేస్తోంది అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2014 ఎన్నికల సమయం నుంచి పాదయాత్ర వరకు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని జపం చేసిన జగన్ రెడ్డి యాత్ర మధ్యలో తమ ఎన్నికల వ్యూహాకర్తల బోధనతో కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదిలేదని ప్రకటించేశారు. కాపుల ఉద్దరణ అని గొంతు చించుకున్న వై.సి.పి.లోని కొందరు నాయకులు వేరేదారి లేక జగన్ రెడ్డి దారిలోనే పయనిస్తూ కాపుల సంక్షేమమే ధ్యేయమని ఇప్పటికీ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

కాపు నాయకులు తనతోనూ, జనసేన పార్టీలోని ఇతర నాయకులతో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అర్ధ శతాబ్దానికి పైగా కోరుతున్న తమ రిజర్వేషన్ గురించి దృష్టి సారించి, ప్రజా వేదికలపై మాట్లాడమని అడుగుతున్నారు. జనసేన ఎన్నికల ప్రణాళికలో అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తామని మాట ఇచ్చిన సంగతిని నేను వారికి గుర్తు చేశాను. కాపులపై ప్రేమతో 13 నెలల్లో రూ.4770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్న జగన్ రెడ్డి సర్కారు కాపులు కోరుతున్న రిజర్వేషన్లను ఎందుకు పునరుద్ధరించడం లేదు అని ప్రశ్నించారు. తమను ఎవరూ ఉద్దరించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

 

Similar News