బడ్జెట్ నిండా ‘జగనన్న’ పథకాలే’

Update: 2020-06-16 12:24 GMT

గతంలో ఎప్పుడూ ఇలా లేదంటున్న అధికారులు

బుగ్గన ప్రసంగంలో ‘జగనన్న’ జపం

ఏపీలో గత బడ్జెట్ లకు..ఈ బడ్జెట్ కూ చాలా తేడా ఉంది. ఇది అంకెల్లో కాదు సుమా. అంకెలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందులో మిగిలేది ఎంతో..పోయేది ఎంతో చివర్లో కానీ తెలియదు. ముందు మాత్రం రంగుల చిత్రాన్ని చూపిస్తారు. తర్వాత ఆ రంగులు వెలవటం మామూలే. ఏ ప్రభుత్వం ఉన్నా అది కామన్ సీన్. ఈ సారి ఏపీ బడ్జెట్ కు కొత్త ప్రత్యేకత ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం నాడు శాసనసభలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఆర్ధిక మంత్రి బుగ్గన ఎన్నిసార్లు ‘జగనన్న’ పేరు చదివారో. ఎందుకంటే వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన ప్రతి కీలక స్కీమ్ కు ముందూ ‘జగన్నన్న’ పేరును జత చేసిన సంగతి తెలిసిందే.

ఇదే ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసలు జగన్ కు ప్రచారం ఇష్టం లేదని..తాము అంతా కోరితే ఒక్క పథకానికి మాత్రం పేరు పెట్టడానికి ఒప్పుకున్నారని అదే అసెంబ్లీలో గొప్పగా ప్రకటించారు. తీరా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ‘జగనన్న’ పథకాల జాబితా చెబుతున్నప్పుడు అధికారులు కూడా అవాక్కయ్యే పరిస్థితి. బడ్జెట్ నిండా ‘జగనన్న జపం’ విన్పించింది. ఏడాది కాలంలోనే సీఎం జగన్ పేరును పలు పథకాలకు పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ కేటాయింపుల ప్రతి సందర్భంలోనూ మంత్రి జగనన్న...జగనన్న అంటూ అలా ప్రకటిస్తూ పోయారు. బడ్జెట్ లో అన్నిసార్లు జగనన్న నామస్మరణ చూసిన అధికారులు గతంలో ఎప్పుడూ ఇంతగా లేదనే వ్యాఖ్యలు చేయటం విశేషం. చంద్రబాబు కొన్ని స్కీమ్ లకు ‘చంద్రన్న’ పేర్లు పెట్టినా కూడా జగన్ చంద్రబాబు ‘రికార్డు’లను బ్రేక్ చేసి మరీ కొత్త కొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు.

 

 

 

Similar News