విశాఖ వైపు చూడని విజయసాయి..కారణమేంటి?

Update: 2020-05-11 06:20 GMT

విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ లో దుర్ఘటన జరిగి సోమవారానికి ఐదు రోజులు కావస్తోంది. కానీ ఇఫ్పటి వరకూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి విజయసాయిరెడ్డి విశాఖవైపు కన్నెత్తి చూడలేదు. కారణం ఏంటి?. గత ఏడాది కాలంగా ఆయన విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు సాగించారు. విశాఖపట్నానికి చెందిన మంత్రులు ఉన్నా కూడా ‘ఫోకస్’ అంతా కూడా విజయసాయిరెడ్డి వైపే ఉండేది. పలుమార్లు మంత్రులతో కలసి ఆయన కూడా అత్యంత కీలకమైన సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొనేవారు. కానీ విజయసాయిరెడ్డి అంతగా ఫోకస్ పెట్టిన విశాఖ జిల్లా కేంద్రంలో ఇంత విషాద సంఘటన జరిగి పది మందికిపైగా మరణించినా కూడా ఆయన ఇఫ్పటివరకూ అటువైపు చూడకపోవటం పార్టీ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ బాధ్యతను సీఎం జగన్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కన్నబాబు, జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్, మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగించారు.

ఇప్పుడు వీళ్ళు ముగ్గురే అక్కడ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. ఎల్ జి పాలిమర్స్ లో ప్రమాదం జరిగిన రోజు అంటే అంటే మే 7న సీఎంతో కలసి విశాఖపట్నం వెళ్ళేందుకు విజయసాయిరెడ్డి రెడీ అయ్యారు. కానీ మధ్యలో ‘మిడిల్ డ్రాప్’ అయిన సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయన విశాఖ వైపు కన్నెత్తిచూడకపోవటంతో ఆ రోజు జరిగిన సంఘటనకు ‘లింక్’ పెట్టి చర్చ సాగుతోంది. సీరియస్ లాక్ డౌక్ ఉన్న రోజుల్లో కూడా విశాఖపట్నం, విజయవాడకు పలుమార్లు తిరిగిన విజయసాయిరెడ్డి ఇఫ్పుడు ఎందుకు అటువైపు వెళ్లలేకపోయారన్నది కీలకమే అంటున్నారు అదికారులు.

విజయసాయిరెడ్డి తో సన్నిహితంగా ఉ:డే ఐఏఎస్ అధికారులు, కొంత మంది పారిశ్రామికవేత్తలు తాజా పరిణామాలతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. నిజంగానే ఇంత కాలంగా అత్యంత కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డిని సీఎం జగన్ పక్కన పెట్టారన్నది వాస్తవమేనా అని వీరు ఆరాలు తీయటం కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొంత మంది అధికారులు ‘పవర్ ఫుల్’ వ్యక్తులను పట్టుకుని తమకు కావాల్సిన పోస్టింగ్ లు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు ‘పవర్’ ఎవరి దగ్గర ఉంటే వారివైపే మొగ్గుచూపుతుంటారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో.

 

Similar News