విశాఖపట్నంలో విషాదం..ప్రాణాలు తీసిన విషవాయువు

Update: 2020-05-07 04:39 GMT

జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో వందలాది మంది ప్రజలు ఊపిరి ఆడక నానా అవస్థలు పడ్డారు. కొంత మంది చిన్న పిల్లలు..పెద్దలు ఆ విషవాయువు పీల్చి ఎక్కడి వారు అక్కడే కుప్పకూలిపోయారు. ఇందులో ఎంతో మంది చిన్నారులు ఉండటం కలకలం రేపుతోంది. ఇలా కుప్పకూలిన చిన్నారుల వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనతో అంబులెన్స్ లో ఎక్కిస్తూ ఆస్పత్రులకు తరలించే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలు చూసిన వారంతా కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. విశాఖపట్నం నగరం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్ జీ పాలిమర్స్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విష వాయువు ఐదు కిలోమీరట్ల వ్యాపించింది. దీంతో ప్రజలు శ్వాస పీల్చటానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో చాలా మంది ఇళ్ళలోనే తలుపులు వేసుకుని ఉండిపోయారు. అయితే పోలీసులు సైరన్లు మోగిస్తూ తక్షణమే అందరినీ ఇళ్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళాల్సిందిగా ఆదేశించారు.

ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్లు చెబుతున్నారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు వ్యాపించింది. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. వెంటనే విశాఖపట్నం జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే విశాఖపట్నం బయలుదేరి వెళ్ళనున్నారు. విశాఖ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.

 

Similar News