మాజీ ఎస్ఈసీ కేసులో తీర్పు రిజర్వ్

Update: 2020-05-08 13:16 GMT

ఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన అంశానికి సంబంధించిన కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత కొన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి దాఖలైన పలు పిటీషన్లపై హైకోర్టు వాదనలు విన్నది. గత రెండు రోజులుగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు పూర్తి చేశారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఐదు రోజుల పాటు ఈ అంశంలో వాద ప్రతివాదనలు జరిగాయి. ప్రభుత్వం తరుపున వాదనలు విన్పించిన అడ్వకేట్ జనరల్ 243కె అధికరణలో పదవీకాలం రక్షణ ప్రస్తావన లేదని తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని.. నిష్పక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు.

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని కోర్టుకు వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్‌ పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణార్హం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వం ఎస్ఈసీని తొలగించలేదని, ఆయన పదవి కాలం ముగిసిందని తెలిపారు. ఎస్ఈసీ కనగరాజ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్.ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం శుభపరిణామమని అన్నారు. కమిషనర్ పదవిని వయసుతో ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు.

Similar News