లాక్ డౌన్ లో తరలించిన ఆ ఇసుక ఎక్కడ?

Update: 2020-05-31 11:56 GMT

ఏపీలో లాక్ డౌన్ సమయంలోనూ ఇసుక లారీలు విపరీతంగా తిరిగాయని..కానీ ఆ ఇసుక డంపింగ్ కేంద్రాలకు మాత్రం చేరలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం తరహాలోనే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తోందని అన్నారు. భవన కార్మికుల సంక్షేమ మండలి నిధులను ఇతర అవసరాలకు మళ్ళించటం సరికాదని, ఈ సీజన్ లో అయినా ఇసుక సరఫరా సక్రమంగా చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు ఆదివారం నాడు ఏపీలోని భవన నిర్మాణ కార్మికులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇసుక మాఫియాను నియంత్రించకపోతే నిర్మాణ రంగం దెబ్బతిని రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయంప్రతిపత్తి కల్పించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఏపీలో ఇసుక ధరలు అధికంగా ఉండటం, సరఫరా సక్రమంగా లేకపోవడంతో నిర్మాణాలు సాగక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవైపోయిందని చెప్పారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ లాక్ డౌన్ ఉన్నా ఇసుక అక్రమ రవాణా ఆగలేదన్నారు. కార్మికులు మాత్రం ఉపాధి లేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని తెలిపారు. ఏపీలో ప్రభుత్వం మారగానే నూతన ఇసుక విధానం అని చెప్పి కొన్ని నెలలపాటు పనులు లేకుండా చేశారన్నారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం 60ఏళ్ళు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాలి. ఈ నిబంధనను రాష్ట్రంలో అమలు చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

 

Similar News