ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు కమిటీ

Update: 2020-05-08 07:45 GMT

విశాఖపట్నంలో విషాదం నింపిన ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు సర్కారు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హైపవర్‌ కమిటీకి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికలవలవన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కె మీనా, పీసీబీ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటానికి గల కారణాలపై ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తుంది.

కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చోటు చేసుకుంటే దానికి గల కారణాలను ఈ కమిటీ అన్వేషించనుంది. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం హైపవర్‌ కమిటీకి సూచించింది. గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన స్టైరిన్‌ విషవాయువును పీల్చడం ద్వారా 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

 

Similar News