హైకోర్టు తీర్పుపై సుప్రీంకు..ఏపీ విద్యా మంత్రి

Update: 2020-04-15 15:21 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే దాన్ని అమలు పర్చటానికే కట్టుబడి ఉంటారు తప్ప..మాట తప్పరని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయటంపై మంత్రి స్పందించారు. తమకు ఇంకా తీర్పు కాపీ అందలేదని..వచ్చాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు. ఆంగ్ల మీడియం అన్నది ఒక విప్లవాత్మక నిర్ణయం అని ఆయన అన్నారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయమో,అపజయమో అని తాము భావించడం లేదని ఆయన అన్నారు. దశలవారీగా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం పెట్టడానికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల వారు ఆంగ్ల మాధ్యమంలో చదువు కోకూడదా? అని ఆయన ప్రశ్నించారు.

Similar News