ప్రధాని మోడీతో మాట్లాడా..చంద్రబాబు

Update: 2020-04-14 08:38 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ప్రధాని నరేంద్రమోడీతో మాట్లారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి..ఆయనతో మాట్లాడాలని అడిగానని తెలిపారు. ప్రధాని మోడీ మంగళవారం ఉదయం 8.30 గంటలకు తనకు ఫోన్ చేశారన్నారు. మోడీతో తన ఆలోచనలు పంచుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఆయన మంగళవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కంటికి కనిపించిన శత్రువైన కరోనాను లాక్ డౌన్ తో కొంత వరకూ కట్టడి చేయగలుగుతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆర్ధిక వ్యవస్థకు ఇదో పెను సవాల్ గా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనాతో అగ్రదేశాలు కూడా అల్లాడిపోతున్నాయని..కొన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా కట్టడి చేయగలుగుతుంటే..కొన్ని మాత్రం సమర్ధంగా చేయలేకపోతున్నాయని తెలిపారు. కరోనా సమస్యకు ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే పరిష్కారం అన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బహుశా ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబులు తొలిసారి మాట్లాడుకున్నది ఇదే అయి ఉంటుందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

Similar News