పవన్ వినతిపై స్పందించిన కేంద్రం

Update: 2020-04-02 15:29 GMT

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యు.కె.లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. గురువారం ఉదయం భారతీయ విద్యార్థుల భయాందోళనలను ట్విటర్ ద్వారా పవన్ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ వి.మురళీధరన్ ఫోన్ లో మాట్లాడారు. యు.కె.లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆహార, వసతి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి మూలంగా వారు, వారి తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారనే విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పారు.

“లండన్ లో ఉన్న హై కమిషన్ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటాం” అని కేంద్ర మంత్రి చెప్పారు. మురళీధరన్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోనూ ఈ అంశంపై ఫోన్ లో సంభాషించారు. లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం పవన్ కల్యాణ్ విజ్ఞప్తికి స్పందించి అక్కడ చిక్కుకున్న విద్యార్థులకు సంబంధించిన వారి వివరాలు అందించాలని కోరింది. వారిని సంప్రదిస్తామని తెలిపింది.

Similar News