విశాఖకు రాజధాని రాకుండా ఎవరూ ఆపలేరు

Update: 2020-04-21 11:48 GMT

‘విశాఖకు రాజధాని రావటం ఖాయం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగదు. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయితే ఈ తరలింపు ఎఫ్పుడు ఉంటుందో చెప్పటం కష్టం.’ అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి మంగళవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిన బిజెపి నేతలతో ఆ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, విజయసాయిరెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి దగ్గర కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్ల రూపాయలు తీసుకుని ఆయనకు అమ్ముడుపోయారని..ఇందుకు మధ్యవర్తిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు.

దీనిపై కన్నా కూడా అంతే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కొనే స్థాయి ఎవరికీ లేదని..విజయసాయిరెడ్డి అధికారమదంతో వ్యవహరిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి తాను కాణిపాకంతోపాటు తిరుపతి వెంకటేశ్వరస్వామి దగ్గర కూడా ప్రమాణానికి రెడీ అని..ఇందుకు కన్నా సిద్ధం కావాలన్నారు. 2019 ఎన్నికల సమయంలో బిజెపి నాయకత్వం ఏపీకి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులను కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి పంచుకున్నారని..దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఏయో నియోజకవర్గాలకు ఎంత పంపించారు.మీరు ఎంత తీసుకున్నారో చెప్పాలన్నారు. అధిష్టానం పంపిన డబ్బుల ఖర్చును అధిష్టానానికి అందజేశారా అని ప్రశ్నించారు. అయినా ఇది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు.

 

 

Similar News