విశాఖలో అవి కరోనాకు హైరిస్క్ జోన్లు

Update: 2020-03-24 11:36 GMT

విశాఖపట్నంలో గాజువాక, సీతమ్మధార, అనకాపల్లి ప్రాంతాలు కరోనాకు హైరిస్క్ జోన్లుగా ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. అలా అని అక్కడ ఉన్న వారందరికీ ప్రమాదం ఉన్నట్లు కాదన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంత్రి ఆళ్ళ నాని మంగళవారం విశాఖపట్నంలో సహచర మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లతో కలసి సమీక్ష నిర్వహించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 1470 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. కరోనా నివారణపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని..వైద్యాధికారుల కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఏపీలో ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ కేసులు ఏడు ఉండగా..వైజాగ్ లో మూడు కేసులు ఉన్నాయి. అయినా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఇంకా కావాలని పిలుపునిచ్చారు. వైరస్‌​నియంత్రణకు ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు 20 కమిటీలు నియమించామని ఆళ్లనాని చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్చందంగా రిపోర్ట్ చేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

 

Similar News