సాక్షిలో తీసేసి.. సర్కారులో సలహాదారు పదవి

Update: 2020-03-25 03:46 GMT

ఆర్. ధనుంజయ్ రెడ్డి. ఇటీవల వరకూ ఏపీలో సాక్షి పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నారు. ఆయన్ను సాక్షి పత్రిక నుంచి తప్పించారు. ఆయన ప్లేస్ లో కొత్త వాళ్లకు బాధ్యతలు అప్పగించారు. ధనుంజయ్ రెడ్డిని సాక్షి రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పించటానికి ప్రధాన కారణం ఆయనపై ఆరోపణలు రావటమే అని ప్రచారం జరిగింది. కానీ విచిత్రంగా సాక్షి నుంచి తప్పించి ఇప్పుడు ఆయనకు సర్కారులో ఏకంగా సలహాదారు కొలువు ఇచ్చారు. అది కూడా ఏకంగా ముఖ్యమంత్రికే. గ్రామ/వార్డు కార్యదర్శులు, స్పందన కార్యక్రమం విషయంలో ధనుంజయ్ రెడ్డి సీఎంకు సలహాదారుగా వ్యవహరిస్తారని సర్కారు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో 625 జారీ చేశారు.

అసలు ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన, గ్రామ/వార్డు కార్యదర్శుల అంశంపై సీఎంకు సలహాలు ఇఛ్చే స్థాయిలో ఉన్న ధనుంజయ్ రెడ్డిని సాక్షి నుంచి ఎందుకు తప్పించినట్లు?. పోనీ ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య ఏమైనా తక్కువ ఉందా అంటే అదీ లేదు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్కారులో సలహాదారులు ఉన్నారు. మరి ధనుంజయ్ రెడ్డి లేకుండా సర్కారు ముందుకు సాగదా?. పోనీ ఈ రంగంలో ఏమైనా ధనుంజయ్ రెడ్డికి విశేష అనుభవం ఉందా అంటే అదీ లేదు. ఈ పరిణామాలపై ప్రభుత్వంలోని కొంత మంది అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 

Similar News