దాడుల వివరాలు కోరిన పవన్ కళ్యాణ్

Update: 2020-03-16 12:15 GMT

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జనసేన కార్యకర్తలపై ఎక్కడెక్కడ దాడులు జరిగాయో ఈ వివరాలు పంపాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఈ అంశాలన్నింటితో కూడిన నివేదికను కేంద్ర హోం శాఖకు అందజేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై మౌనంగా ఉంటే..సార్వత్రిక ఎన్నికల్లో మరింత పెట్రేగిపోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలకు చేపట్టిన ఎన్నికల నామినేషన్ల దశలో చెలరేగిన హింస, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని వ్యాఖ్యానించారు. అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్ ఇచ్చినా బలవంతంగా ఉపసంహరింప చేయడం దురదృష్టకరం అని చెప్పారు. తమ బాధ్యతలు విస్మరించి అధికార పార్టీ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగం పని చేయడం సమాజానికి హాని చేస్తుంది అన్నారు.

నిజాయతీ నిబద్ధత కలిగిన అధికారులు కొందరు ఈ పరిస్థితులను మౌనంగా భరిస్తున్నారు... వీటిని చేదించాల్సిన సమయం వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసిన తీరుపై కేంద్ర హోమ్ శాఖకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

 

Similar News