నాయకుడు అన్ని ప్రాంతాలను సమంగా చూడాలి

Update: 2020-03-04 14:58 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులను ఎలా చూస్తున్నారో..మిగిలిన ప్రాంతాలను కూడా అలాగే చూడాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. నాయకుడు అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలన్నారు. పులివెందుల నియోజకవర్గానికి రాత్రికి రాత్రి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి..మిగిలిన ప్రాంతాలకు మొండి చూపటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రశాంతమైన విశాఖపట్నంలో ఫ్యాక్షన్ సంస్కృతితో రాజకీయాలను కలుషితం చేస్తున్నరని ఆరోపించారు. మనోహర్ బుధవారం నాడు వైజాగ్ అర్భన్ నేతల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్షలతో జనసైనికులపై కేసులు పెడుతున్నారని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు రోజుకో రకంగా మాట్లాడితే పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి ముందుకొస్తారని ప్రశ్నించారు. జనసేన పార్టీ ఎప్పుడూ పదవులు, భూముల కోసం దిగజారి రాజకీయాలు చేయదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ విధానం అని తెలిపారు. నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా నియమితులైన వారు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.

2014లో అప్పటి పరిస్థితుల ప్రకారమే పవన్ కళ్యాణ్ బిజెపి, టీడీపికి మద్దతు ప్రకటించారన్నారు. జనసేన మద్దతు లేకపోతే అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చేదా? అని మనోహర్ ప్రశ్నించారు. రాజకీయాల్లో విధానాలపై విమర్శలు ఉండాలి తప్ప..పోలీసులను అడ్డం పెట్టుకుని జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడం సరికాదన్నారు. సోషల్ మీడియాను పార్టీ బలోపేతానికి, కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగించాలే తప్ప..వ్యక్తిగత దాడుల కోసం కాదన్నారు. జనసేనపై బురదజల్లటానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి నెల 10 కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ 300 మంది టీమ్ ను నియమించుకున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు జనసేనలో చేరినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

 

 

Similar News