కరోనా పోరు..భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

Update: 2020-03-26 08:31 GMT

కరోనా సమస్యను అధిగమించేందుకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర సర్కారు పేదలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీతో ముందుకొచ్చింది. ఎవరూ ఆకలితో ఇబ్బంది పడకుండా అవసరమైన నిత్యావసరాలు అందించేందుకు సిద్ధం అయింది. అదే సమయంలో కరోనాను నిరోధించేందుకు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న వైద్యులు, శానిటేషన్ వర్కర్స్, పారామెడికల్ సిబ్బంది, హెల్త్ కేర్ వర్కర్స్ ఒక్కొక్కరికి 50 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం 1.70 లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్యాకేజీ ప్రకటించారు. వచ్చే మూడు నెలల పేదలకు రేషన్ తోపాటు అదనంగా ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందించనున్నారు. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

బియ్యం, గోధుమలు 80 కోట్ల మందికి అందించనున్నట్లు తెలిపారు. రేషన్ తోపాటు అదనంగా కేజీ కందిపప్పు కూడా ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కోట్ల పేద వృద్ధులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఏడు కోట్ల స్వయం సహాయక బృందాల 20 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించనున్నారు. 8.69 కోట్ల రైతులకు పీఎం కిసాన్ యోజన్ కింద రెండు వేల రూపాయలు అందివ్వనున్నారు. మూడు నెలల పాటు 20 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాల్లో 500 రూపాయలు జమ చేస్తారు. ఉపాది హామీ కూలీ 182 రూపాయల నుంచి 202 రూపాయలకు పెంచారు. ఉజ్వల లబ్దిదారులకు మూడు నెలలకు గాను నెలకు ఒక సిలిండర్ గా ఉచితంగా ఇవ్వనున్నారు.

 

Similar News