అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

Update: 2020-03-07 07:12 GMT

గత కొన్ని రోజులుగా వివాదస్పదంగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు తీరు ఏ మాత్రం సరికాదని ఆక్షేపించారు. శనివారం నాడు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ దేవస్థానం భూములపై కొంత మంది కన్నేశారని సంచలన ఆరోపణలు చేశారు. సింహచలం దేవస్థానం పరిధిలో 105 ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని తెలిపారు. దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ట్రస్ట్ కు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. సంచిత ఆధార్ కార్డు చూస్తే ఆమె ఎక్కడ ఉంటుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరుతో భవిష్యత్ తరాలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో తాము అందరితో కలసి న్యాయ పోరాటానికి రెడీ అవుతున్నట్లు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ తీరు వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ జీవోను ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సర్కారు తీరు భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టేలా ఉందన్నారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ లో దేవాదాయ శాఖ అధికారులతోనే... నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా... ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు. రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?... ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

 

 

Similar News