కరోనా దెబ్బ..భారతీయ టూర్ ఆపరేటర్లకు 3600 కోట్ల నష్టం!

Update: 2020-02-08 05:43 GMT

ప్రపంచ పర్యాటక రంగంపై ‘కరోనా వైరస్’ ప్రభావం బాగానే పడింది. ఒక్క భారతీయ టూర్ ఆపరేటర్లే ఈ దెబ్బకు భారీ ఎత్తున నష్టపోనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే ఇండియన్ టూర్ ఆపరేటర్లు 3600 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని ఓ అంచనా. దీనికి కారణం పర్యాటకులు పెద్ద ఎత్తున తమ పర్యటనలను రద్దు చేసుకోవటమే. చైనాతోపాటు పలు ఇతర దేశాలను భారత్ వచ్చే పర్యాటకులు వైరస్ కారణంగా తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందని టూర్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకుల్లో నెలకొన్న భయం కారణంగా ప్రతి రోజు వేల సంఖ్యలో తమ బుకింగ్స్ ను పర్యాటకులు రద్దు చేసుకుంటున్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) వెల్లడించింది. చైనాకు దగ్గరగా ఉండే హాంకాంగ్, మకావ్, బ్యాంకాక్ లపైన కూడా ఈ కరోనా వైరస్ ప్రభావం పడినట్లు చెబుతున్నారు. త్వరలోనే వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. అప్పటి వరకూ కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తే ఓకే..లేదంటే ఈ ఏడాది పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

 

Similar News