మండలి ఛైర్మన్, యనమల పై వైసీపీ విమర్శల దాడి

Update: 2020-01-23 08:18 GMT

నిబంధనల ప్రకారం లేకున్నా మూడు రాజధానుల బిల్లును తన విచక్షాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించిన మండలి ఛైర్మన్ షరీఫ్ పై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మంత్రులు..ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ తీరును తప్పుపట్టారు. ప్రజాతీర్పును కాలరాసేలా వ్యవహరించే అధికారం ఛైర్మన్ కు ఎవరిచ్చారని అన్నారు. చంద్రబాబు మండలి ఛైర్మన్ గా తన తొత్తును పెట్టుకున్నారని ఆరోపించారు. మండలి ఛైర్మన్ నిర్ణయం అత్యంత దురదృష్టకరం అన్నారు. సంఖ్యాబలం ఉందని మండలిలో ఇష్టారాజ్యం చేశారని విమర్శించారు. నిబంధనలు పాటించాలని సభలో సగం మంది చెప్పినా కూడా మండలి ఛైర్మన్ పాటించలేదని అన్నారు. కొంత మంది మంత్రులు సభకు మందు కొట్టి వచ్చారంటూ మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యనమల అసలు ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం అవుతుందా? అని ప్రశ్నంచారు.

మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా మండలి ఛైర్మన్, యనమల తీరుపై ధ్వజమెత్తారు. వీళ్లిద్దరి తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. సభలో ఎన్నిసార్లు నిబంధనలగురించి చెప్పినా ఆయన టీడీపీ సభ్యుల మాట..చంద్రబాబు మాటే విన్నారని ఆరోపించారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలి ఛైర్మన్ షరీఫ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి..రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

 

 

Similar News