అసెంబ్లీని ముట్టడిస్తామనటం సరికాదు

Update: 2020-01-19 15:45 GMT

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ ముట్టడి వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. సభ్యులు కాని వారు ఎవరైనా సభలోకి వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సభ్యులను చట్ట సభలకు హాజరు కాకుండా నిరోదించడమనేది సభా హక్కులను హరించడమే అవుతుందని తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తోందని అన్నారు. ఆదివారం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం శాసన సభ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సభలు నిర్వహించకుండా ఎవరైనా అడ్డుకుంటే అది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు.

చట్టానికి లోబడి ఎవరైనా నిరసన తెలియజేయవచ్చునని అన్నారు. సభ్యుల సమస్యలు సభలో ఎవరైనా చెప్పుకోవచ్చని, అంతే కాని దాడులు చేస్తాం. ముట్టడిస్తామనేది సరైన పద్ధతి కాదన్నారు. సభకు సభ్యులు రాకుండా అడ్డుకోవడం కూడా నేరమే అని, అలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు సభకు ఉందని స్పీకర్‌ పేర్కొన్నారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేశారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.

 

Similar News