జనసేన ఒక్క ఎమ్మెల్యే జంప్ అయినట్లేనా!

Update: 2020-01-11 10:22 GMT

గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జంప్ అయినట్లే కన్పిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు చేయటంతోపాటు..అసెంబ్లీలో కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జనసేనకు రాపాక వరప్రసాద్ గుడ్ బై చెప్పినట్లే కన్పిస్తోంది. ఆయన శనివారం నాడు ఏపీ మంత్రి కొడాలి నానితో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని రాపాక వరప్రసాద్‌ తెలిపారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సాహసం గొప్పదని ఆయన పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఎమ్మెల్యే రాపాక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాయకుడు పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య ఎటువంటి చర్చలు ఉండవు. ఇక్కడకు రావటంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా అభిప్రాయాలను నేను కచ్చితంగా చెప్తాను.

రాజధాని రైతులు రోడ్డు మీద ధర్నాలు చేసే బదులు ముఖ్యమంత్రిని కలిస్తే న్యాయం జరుగుతుంది. ఎడ్ల పందేలంటే ఇష్టంతోనే గుడివాడ వచ్చాను. నన్ను ఈ పందేలకు ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని కి ధన్యవాదాలు’అన్నారు. ఓ వైపు అమరావతిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంటే ఆ సమావేశానికి వెళ్ళకుండా మంత్రితో కలసి రాపాక ఓ కార్యక్రమంలో పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. ఆయన బహిరంగంగా ఎన్ని ప్రకటనలు చేస్తున్నా కూడా జనసేన మాత్రం మౌనంగానే ఉంటోంది. తనంతట తానుగా పార్టీని వీడితే తమకు ఎలాంటి మట్టి అంటదని జనసేన ఆలోచిస్తోంది. జగన్ కు అనుకూలంగా మాట్లాడి సస్పెండ్ అయి వెళితే బాగుంటుందని రాపాక ఆలోచన. ఇలా ఎవరికి వారు ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతున్నారు.

 

 

Similar News