నిర్భయకున్యాయం....జనవరి 22నే వాళ్ళకు ఉరి

Update: 2020-01-07 13:02 GMT

ఏడేళ్ళ తర్వాత నిర్భయకు న్యాయం. అత్యంత దారుణంగా ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న జరిగిన దారుణ రేప్ ఘటనకు సంబంధించి దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారు అయింది. దోషులు తేలిన తర్వాత కూడా వీళ్ల ఉరి శిక్ష అమలు రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. చివరకు ఆ తేదీ వచ్చేసింది. నిర్భయ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాల హౌస్‌కోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణలో భాగంగా మంగళవారం డెత్‌ వారెంట్‌ను జారీచేసింది. దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ నిర్భయ తల్లి ఆశాదేవీ పాటియాల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీనిపై విచారించిన న్యాయస్థానం దోషులు ముఖేష్‌, పవన్‌గుప్తా, అక్షయ్‌కుమార్‌, వినయ్‌శర్మ డెత్‌ వారెంట్‌ను జారీచేసింది. తమ ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ.. నలుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. దీంతో శిక్ష అమలుకు లైన్‌క్లియర్‌ అయ్యింది. 2012 డిసెంబర్‌ 16న నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఆందోళనకు దారి తీసింది. 2013 సెప్టెంబర్‌ 13న నలుగురు నిందితులును దోషులకు తేల్చుతూ.. న్యాయస్థానం మరణశిక్షను విధించింది. హైకోర్టు ఆదేశాలపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికి తమకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.

 

Similar News