నారా లోకేష్ లక్ అంతే...!

Update: 2020-01-07 08:14 GMT

నారా లోకేష్ లక్ అలా ఉంటుందేమో. ఆయన ఏది మాట్లాడినా ఆయనకే రివర్స్ కొడుతుంటుంది. లోకేష్ మంగళవారం నాడు ఓ సమావేశంలో మాట్లాడుతూ అమరావతి రైతుల ఆందోళనలో ఎక్కడైనా ఓ అద్దం పగిలిందా? అంటూ ప్రశ్నించారు. ఆయన అలా ప్రశ్నిస్తున్న సమయంలోనే గంటూరు జిల్లా చినకాకాని దగ్గర వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు అద్దాలను ఆందోళనకారులు పగలగొట్టారు. టీవీల్లో ఓ వైపు ఆ విజువల్స్ వస్తున్నాయి. లోకేష్ అద్దాల గురించి మాట్లాడుతున్నారు. విచిత్రం అంటే అదే మరి. ఎమ్యెల్యే భద్రతా సిబ్బందిపై అమరావతి ఆందోళకారులు దాడి చేయటంతోపాటు ఎమ్మెల్యే కారుపై రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. అమరావతి రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు రైతులపై కక్ష గట్టి వ్యవహరిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు నిర్ణయం ద్వారా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల భూకబ్జాలపై విశాఖ వాసులు భయపడుతున్నారని అన్నారు. కొన్ని భవనాలను మార్చి అదే అభివృద్ధి చెబుతారా? అని ప్రశ్నించారు. ‘రాజధాని పై జగన్ నాడు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. అమరావతిపై అభ్యంతరం లేదు అన్నారు....30 వేల ఎకరాలు కావాలి అన్నారు.

అమరావతి శంకుస్థాపనకి ఇతర రాష్ట్ర ముఖ్యమంతులు వచ్చినా....జగన్ రాలేదు. శాసన సభలో తీర్మానం పెడితే అంతా ఆమోదించారు. ఒక సచివాలయం పెడితే అభివృద్ధి జరగదు. ప్రభుత్వం వద్దు అనుకున్న అదాని గ్రూప్ తెలంగాణకు వెళ్ళింది. మిషన్ భగీరథ, కాకతీయకు డబ్బులు వచ్చింది....సైబరాబాద్ నుంచి కాదా!? మూడు రాజధానులు కాదు. మూడు ముక్కలు రాజధాని. రైతుల పోరాటానికి పోలీసులు అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు. ఆ మూడు నెలల్లో జరిగిన లావాదేవీలు 125 ఎకరాలు మాత్రమే. కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలి. నా తల్లి గురించి విమర్శలు చేస్తున్నారు....జగన్ ఇంట్లో మహిళల గురించి మేము మాట్లాడగలం’ అని వ్యాఖ్యానించారు.

 

Similar News