జనసేన, బిజెపి పొత్తుతో వైసీపీలో వణుకు

Update: 2020-01-18 10:33 GMT

ఏపీలో జనసేన, బిజెపి పొత్తు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడనుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. తమ రెండు పార్టీలు కలవటంతో అధికార వైసీపీలో వణుకు ప్రారంభం అయిందని అన్నారు. శనివారం నాడు నాదెండ్ల మనోహర్ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులకు జనసేన-బిజెపి అండగా ఉంటాయన్నారు. ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన ప్రాంతంలోనే రాజధాని ఉండాలన్నారు.

విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు అయ్యేలా తమ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ అప్రజస్వామిక, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించటానికే తమ రెండు పార్టీలు కలిశాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. తమ పొత్తుపై వైసీపీ నాయకుల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి రేణిగుంట చేరుకున్న మనోహర్ కు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు స్వాగతం పలికారు.

 

 

Similar News