హైకోర్టులో జగన్ కేసు ఫిబ్రవరి 6కి వాయిదా

Update: 2020-01-28 09:04 GMT

అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది. జగన్ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలు చేయటానికి తమకు సమయం కావాలని సీబీఐ తరపు లాయర్ కోరగా..ఫిబ్రవరి 6లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఆదేశాలు జారీ చేయాలని జగన్ తరపు లాయర్ కోర్టును కోరారు. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న అంశం సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలని న్యాయస్థానం ఆదేశించింది.

ముఖ్యమంత్రి అయినందున తనకు పని భారం ఉందని...సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసుల విషయంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లను ఆ న్యాయస్థానం తిరస్కరించింది. జగన్ పై ఉన్నవి తీవ్రమైన ఆర్ధిక నేరాలు అయినందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ రెండు సంస్థలు కోర్టు ముందు వాదించాయి. ఈ వాదనలనే సీబీఐ కోర్టు సమర్ధించింది. దీంతో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టును ఆశ్రయించారు.

Similar News