స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి బరిలోకి జనసేన, బిజెపి

Update: 2020-01-28 16:39 GMT

అమరావతి రైతులకు అండగా ఉండాలని సమన్వయ కమిటీ నిర్ణయం

రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అమరావతి ప్రాంత ప్రస్తుత దుస్ధితికి టీడీపీ, వైసీపీలే కారణం అని బిజెపి-జనసేనల సమన్వయ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. కమిటీ తొలి సమావేశం మంగళవారం నాడు విజయవాడలో జరిగింది. ఇందులో ముఖ్యంగా రాజధాని రైతుల కు భరోసాగా నిలవాలని నిర్ణయించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా వెళ్ళి, వారికి అండగా నిలవాలని ఉభయ పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. రైతులకు భరోసా కల్పించాలని, అమరావతి రాజధాని విషయంలో ఉభయ పార్టీలు పోరాటం చేయాలని సంకల్పించాయి. ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన తరపున జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్, కందుల దుర్గేష్ సిహెచ్.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి హాజరయ్యారు.

రాజధాని మార్పు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు.రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నామని అధికార వైసీపీ ప్రచారం చేస్తోందని, ఇది పూర్తిగా సత్యదూరమైన ప్రచారమనీ ఇలాంటి అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, నాడు అధికారంలో ఉన్న పార్టీ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఈ కమిటీ పేర్కొంది. బిజెపీ – జనసేన పార్టీలు కలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తరవాత కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు.

 

Similar News