పాలించటం చేతకాకపోతే దిగిపోండి..పవన్

Update: 2019-12-03 11:32 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వానికి పరిపాలించటం చేతకాకపోతే మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని వ్యాఖ్యనించారు. అంతే కానీ ప్రజలను ఇబ్బందుల పాలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు బజార్లో కిలో ఉల్లిపాయలు రూ.25కే ఇస్తామని చెబుతున్నా అమలు జరగడం లేదని అన్నారు. ప్రజల కష్టాలు సర్కార్ కి పట్టదని చెప్పారు. గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన.. ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. మంగళవారం ఉదయం తిరుపతిలోని ఆర్సీ రోడ్డు వద్ద ఉన్న రైతు బజార్ కు వెళ్లారు. అక్కడ ప్రభుత్వ సబ్సిడి ఉల్లిపాయల కోసం ప్రజలు వేచి చూడటం చూసి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. “జగన్ వస్తాడు.. ఉద్ధరిస్తాడు అనుకొంటే ఏం ఉద్ధరించాడు. పప్పులు, కూరగాయలు, పామాయిల్ ధరలు పెరిగిపోయాయి. పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇస్తున్నాం అంటున్నారు, ఓసీలకు ఇవ్వరు.ఏం కొనాలన్నా భయమేస్తోంది.

రైతు బజారులో అన్ని కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. వెయ్యి రూపాయలు తెచ్చుకున్న సంచి నిండటం లేదు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఉల్లిపాయలను సైతం రూ. 80 కి అమ్ముతున్నారు. మంచి రకం కావాలంటే రూ.130 పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తామని చెబుతున్న సబ్సిడి ఉల్లి ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియడం లేదు" అని జ్యోతి అనే గృహిణి పవన్ కళ్యాణ్ వద్ద వాపోయారు. రెచ్చగొట్టే రాజకీయాలకు జనసేన దూరం. పార్టీ పెట్టిందే ప్రజా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయడానికి. ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకురావాలి. లేని పక్షంలో ప్రజలందరితో కలిసి ఆందోళనను ముందుకు తీసుకెళ్తామ"ని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

అంతకుముందు తనను చూడటానికి వచ్చిన జనసైనికులు, అభిమానుల వల్ల ఉల్లి వ్యాపారికి నష్టం వాటిల్లితే ఆయనకు రూ. 3వేలు పరిహారం ఇచ్చారు. ఎండబెట్టిన ఉల్లిపాయలను చిందరవందరగా అభిమానులు తన్నేయడంతో వాటిని ఎత్తి తిరిగి చాపమీద పోశారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... "ఉల్లి ధరలతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే రైతు బజారుకు వచ్చాం. నాలుగు రోజులైన సబ్సిడి ఉల్లిపాయలు మార్కెట్లో లేకపోవడం దారుణం. స్టాక్ వచ్చినా ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉల్లిపాయల పంపిణీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. ప్రభుత్వ ప్రణాళిక లోపం వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేద"ని అన్నారు.

 

Similar News