అమరావతిలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న పోలీసులు

Update: 2019-12-31 09:07 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి గ్రామాల పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. రాజదానిలోని మందడం గ్రామ రైతులను కలిసేందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వెంకటపాలెం చలివేంద్రం దగ్గర పవన్ కళ్యాణ్ బైఠాయించారు. పోలీసు కంచెలను రైతులు, జన సైనికులు తొలగించటంతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్లారు. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల చర్యపై జనసేన కార్యకర్తలు, రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. భారీ ఎత్తున మొహరించిన పోలీసులు ఇనుప కంచెలతోపాటు ప్రొక్లెయిన్ లను అడ్డు పెట్టి పవన్ కాన్వాయ్ ముందుకెళ్ళకుండా అడ్డుకున్నారు.

దీంతో పవన్ కళ్యాణ్ తన కారు దిగి నడుచుకుంటూ ముందుకెళ్ళారు. అదే సమయంలో పవన్ మాట్లాడుతూ పాదయాత్రగా మందడం వెళతానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అమరావతిలో రైతుల సమస్య కూడా చాలా పెద్ద సమస్య అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ ను పోలీసులు అడ్డుకున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున వెంకటపాలెం చెక్ పోస్టు వద్దకు తరలివచ్చారు. ఆ మార్గంలో ముఖ్యమంత్రి పయనించచాల్సి ఉందని...ఆయన వెళ్ళే వరకూ వేచిచూడాలని పోలీసులు పవన్ కు సూచించారు. దీంతో పవన్ కొద్దిసేపు అక్కడ వేచిచూశారు.

 

 

Similar News