జగన్ క్యాంప్ కార్యాలయం కోసం జారీ చేసిన జీవోలు రద్దు

Update: 2019-12-07 06:39 GMT

2.87 కోట్ల కేటాయింపుల ప్రతిపాదనలు వెనక్కి!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసం, క్యాంపు కార్యాలయంలో వివిధ పనులు చేపట్టేందుకు ఉద్దేశించిన రోడ్లు, భవనాల శాఖ పలు ధపాల్లో సుమారు 2.87 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సీఎం క్యాంప్ కార్యాలయం, నివాసంలో సుమారు 73 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అల్యూమినియం కిటికీలు, ఇతర డోర్లు ఏర్పాటుకు అనుమతి మంజూరు అయింది. వార్షిక నిర్వహణ కోసం అంటూ మరోసారి 1.20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. విద్యుత్ పనుల కోసం 8.50 లక్షలు, భద్రతా ఏర్పాట్ల కోసం 24.50 లక్షల రూపాయలు, ఇతర పనుల కోసం 22.58 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా ఆర్ అండ్ బి శాఖ ఈ ఉత్తర్వులు అన్నీ రద్దు చేసింది. గతంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఇలాగే తన నివాసాలు, క్యాంప్ కార్యాలయాల కోసం భారీ ఎత్తున వ్యయం చేశారని వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.

దీంతో కొత్తగా జగన్ కోసం జీవోలు జారీ అయినప్పుడు ప్రతిసారి టీడీపీతోపాటు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సర్కారు జీవోల రద్దుకు నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం వెలువడినట్లు చెబుతున్నారు. సహజంగా అయితే సీఎం కార్యాలయాలు, నివాసాల భద్రతతోపాటు ఇతర అంశాలు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ గతంలో చేసిన విమర్శలు...ఇప్పుడు అవే తిరిగి రావటంతో జగన్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ వ్యయంతో పలు పనులు చేపట్టారు.

 

 

 

 

Similar News