కమిటీ నివేదిక తర్వాతే రాజధాని అమరావతిపై స్పష్టత

Update: 2019-12-14 12:19 GMT

ఏపీ నూతన రాజధాని ‘అమరావతి’ అంశాన్ని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గందరగోళం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ వేసిన ప్రశ్నకు రాజధానిని అమరావతి నుంచి మార్చటం లేదని స్పష్టం చేశారు. అందువల్ల రాజధాని మార్పు వలన వ్యయం పెరగటం, ఎంత ఖర్చు అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో అమరావతిపై అందరిలో నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అయింది. బొత్స సత్యనారాయణ శనివారం నాడు కౌన్సిల్ లో ఇచ్చిన సమాధానానికి భిన్నంగా వ్యాఖ్యానించారు. దీంతో మళ్లీ అమరావతిపై గందరగోళం మొదలైనట్లు అయింది. ప్రభుత్వం రాజధానిపై నియమించిన కమిటీ నివేదిక తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని బొత్స వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై మరింత చర్చించాల్సి ఉందని అన్నారు. ఓ వైపు మండలి వంటి చట్టసభలో అమరావతిని మార్చటంలేదని చెప్పి...బయట మాత్రం అందుకు భిన్నంగా కమిటీ నివేదిక రావాలని..ఇంకా చర్చ జరగాలని చెప్పటం ఆసక్తికరంగా మారింది. రాజధాని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో మునిసిపల్ ఎన్నికలు ఉంటాయని, విశాఖ మెట్రోను రెండు దశలుగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Similar News