జగన్ తిరుపతి ప్రసాదం తింటారో..లేదో?. పవన్ కళ్యాణ్

Update: 2019-11-14 10:04 GMT

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంగిత జ్ఞానం ఉన్న వారు ఎవరూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడరని మండిపడ్డారు. వాళ్ళకు ఇంగిత జ్ఞానం అంటే తెలుసో..లేదో వాళ్ళ భాష ఇంగ్లీష్ లో దీన్ని కామన్ సెన్స్ అంటారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతం మార్చుకున్నా కూడా..కులం పేరు తగిలించుకుంటున్నారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. జగన్‌ క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారని.. దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తనకు తెలియదన్నారు. తనను పవన్ నాయుడు అని వైసీపీ నేతలు ప్రస్తావించటంపై కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పేరులో లేని పదాలను తనకు ఆపాదించటం సరికాదన్నారు.

ఏ కులంలో పుట్టాలో..ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో ఉండదన్నారు. కాకపోతే లా ప్రవర్తించాలో అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. తనను తిడితే బొత్సకు రెండు నెలలు మంత్రి పదవి పెరుగుతుందని పవన్‌ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. మనుషుల్ని చంపాక ఇసుక వారోత్సవాలు చేయడం వికటాట్టహాసమని అన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. తాము విడిపోయి ఎవరికి వాళ్లుగా బతుకుతున్నామని అన్నారు. మంగళగిరిలో జనసేన నేతలతో భేటీ అయిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స తమ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పాలని సూచించారు.

తామంతా ఒకే జాతి అన్న భావన తెలంగాణలో ఉందని.. ఆంధ్రాలో ఆ భావన లేదు, కులాలవారీగా విడిపోయారన్నారు. వైసీపీలో ఎంతో మంది మేధావులు ఉన్నారని.. తెలుగు భాషను చంపేస్తామంటే ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. భాషా సంస్కృతులను కాపాడలేకపోతే మట్టికొట్టుకుపోతారన్నారు. తాను ఆవేశంలో మట్టికొట్టుకుపోతారనే మాటలు మాట్లాడలేదని..తెలుగు భాషను అగౌరపరిస్తే మీరు మట్టిలో కలసి పోతారు అని మరోసారి చెబుతున్నా అని వ్యాఖ్యానించారు. జనసేనది భాషల్ని గౌరవించే సిద్ధాంతం అన్నారు. ఇంగ్లీష్‌ రాలేదని నేతలు డబ్బు సంపాదించకుండా ఉన్నారా? అని పవన్‌ ప్రశ్నించారు.

 

 

Similar News