పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Update: 2019-10-28 12:23 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక కొరత కారణంగా ఏపీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న విశాఖపట్నంలో ‘లాంగ్ మార్చ్’ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఓ వైపు జనసేన దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూనే మిగిలిన పార్టీలు కూడా ఈ పోరాటంలో కలసి రావాలని ట్విట్టర్ వేదికగా కోరారు పవన్ కళ్యాణ్ . ఈ అంశంపై బీజేపీ, వామపక్షాలు ఇప్పటికే స్పందించాయని అన్నారు. మిగిలిన పార్టీలు కూడా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చోటుచేసుకున్న భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు నా మనసును పట్టి కుదిపేశాయి. నెలల తరబడి ఉపాధికి దూరమై కష్టాల పాలై ఉసురు తీసుకొంటున్నారు.

లక్షల మంది కార్మికుల కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా మనమంతా కలిసి సంఘటితంగా పోరాడాలి. అసమగ్రమైన ఇసుక విధానం వల్ల బాధితులుగా మిగిలిన ఆ కార్మికుల ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలి. ఇప్పటికే బి.జె.పి., వామపక్షాలు స్పందించాయి. మిగిలిన పార్టీలు సైతం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై పోరాడేందుకు ముందుకు రావాలి’. అని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు విశాఖ సమావేశంతో పాటు జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సన్నాహాక సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

నవంబర్ 3 విశాఖ సమావేశానికి సన్నాహాక ఏర్పాట్ల కింద అక్టోబర్ 30న జిల్లాల్లో కార్మికుల చేతుల మీదు గా పోస్టర్లు ఆవిష్కరింపచేయాలని నిర్ణయించారు.అనంతరం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఈ నెల 31న అన్ని జిల్లా కార్యాలయాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో నకిలీ ఖాతాలతో విశాఖపట్నం కార్యక్రమం కోసం కొంత మంది విరాళాలు స్వీకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని..వీటిని ఏ మాత్రం విశ్వసించవద్దని పవన్ ఓ ప్రకటనలో కోరారు.

Similar News