‘నరకం’ చూసిన నగరం!

Update: 2019-10-21 10:03 GMT

ఓ వైపు ఆర్టీసి సమ్మె. మరో వైపు ప్రగతి భవన్ ముట్టడి పిలుపు. బయటకు కదలాలంటే బైకో..కారో బయటకు తీయాల్సిందే. లేదంటే మరో మార్గమే లేదు. మెట్రో రైలులోనూ కాలుపెట్టే ఛాన్స్ దొరకటం లేదు. ఒకప్పుడు కాస్త అటు ఇటుగా హాయిగా సాగే మెట్రో ప్రయాణం గత పక్షం రోజులుగాపైగా రద్దీతో చుక్కలు చూపిస్తోంది. మరో వైపు బస్సులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రదానంగా ఆర్టీసి సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘ప్రగతి భవన్ ’ ముట్టడి నగర ప్రజలకు చుక్కలు చూపించింది. సీఎం కెసీఆర్ అధికారిక నివాసం, క్యాంప్ కార్యాలయం ముట్టడికి పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు...కార్యకర్తలు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రగతి భవన్‌కు దారితీసే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ప్యారడైజ్‌నుంచి బేగంపేట వరకు వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది.

దీంతోపాటు బేగంపేట మెట్రో స్టేషన్ ను కూడా మూసేయటం మరింత సమస్యగా మారింది. నిరసనకారులు మెట్రో రైళ్లలో ప్రగతి భవన్‌కు చేరుకోకుండా ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో నగరంలో రద్దీ కూడా భారీ ఎత్తున పెరిగింది. నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్‌ ముందుకు కదలకపోవటంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. ఆర్టీసీ బస్సులు తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు పెద్దసంఖ్యలో సెట్విన్‌ బస్సులపై ఆధారపడుతున్నారు. ట్రాఫిక్ ఇక్కట్లతో హైదరాబాద్ లో వాహనదారులు నరకం చూశారు. సర్కారు తీరుపై కొంత మంది మీడియాసాక్షిగా తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జోక్యం చేసుకుని ఆర్టీసి సమ్మెను పరిష్కరించాలి కోరారు.ఆర్టీసి బస్సుల రద్దుతో అందరూ సొంత వాహనాలనే రోడ్డు మీదకు తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐటి కారిడార్ వైపు వెళ్ళే పంజాగుట్ట, అమీర్ పేట, బేగంపేట, ప్యారడైజ్, ఖైరతబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు నానా అగచాట్లు పడ్డారు.

 

Similar News