అమరావతిలో నా పేరు లేకుండా చేసేందుకే..!

Update: 2019-10-22 15:42 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో తన జ్ఞాపకాలు కనపడకూడదని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ తీరును ఆయన తప్పుపట్టారు. అన్నీ రెడీ చేసిపెట్టిన బంగారు బాతులాంటి వ్యవస్థను చంపేస్తారా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధ కలుగుతుందన్నారు. అమరావతి ప్రస్తుతం కొన ఊపిరితో ఉందన్నారు. తనకున్న విశ్వసనీయతను సింగపూర్ ప్రభుత్వం గుర్తించిందని, తనపై నమ్మకంతో ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ ఇచ్చిందన్నారు. నాలుగేళ్లలో 11 శాతం గ్రోత్ రేట్ పెంచిన ఘనత తమదేనన్నారు.

వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తనకు డీజీపీ రూల్స్ నేర్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్ కాపాడే బాధ్యత టీడీపీపై ఉందని, రాష్ట్రంలో ఇసుక కొరత, విద్యుత్ కోతలు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు.. జే.టాక్స్ పేరుతో వైసీపీ శ్రేణులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ తో కోట్ల రూపాయలు ఆదా చేశామని చెబుతున్నారని..కానీ పనుల జాప్యం వల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చివరకు సామాజిక మాధ్యమాలపై కూడా ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు.

Similar News