టీఆర్ఎస్ లో ఆగని మాటల తూటాలు

Update: 2019-09-05 16:20 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ఇంత కాలం ఒత్తిడి భరించిన వారు బయటకు వస్తున్నారా?. తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. ఇటీవలే మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపారు అని చెప్పొచ్చు. తాజాగా ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే చేరారు. అది కూడా ఈటెల సమక్షంలోనే జరగటం విశేషం. గురువారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చని. తమకు అబద్దాలు రావని, కడుపులో ఏమీ దాచుకోమని, ఉద్యమంలో కొట్లాడినోళ్లమని రసమయి వ్యాఖ్యానించారు. అయితే రసమయి మాట్లాడుతుంటే జాగ్రత్తగా మాట్లాడమని నవ్వుతూ ఈటల సూచించారు.

దీనికి సమాధానంగా ఏమీ కాదులే అని బాలకిషన్‌ ఈటెలకు సూచించారు. తాము కేవలం నిజాలే చెబుతాం అని రసమయి అంటే ఎవరు అబద్ధాలు చెబుతున్నట్లు?. అసలు ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈటెల రాజేందర్ కూడా మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు. కొంతమంది రాజకీయ నేతలకు మెరిట్ లేదని రాజేందర్ తప్పుబట్టారు. రాజ్యాంగం రాసుకున్నట్లు మనం ఉన్నామా అని ప్రశ్నించారు. అంబేద్కరిజంపై చర్చ జరగాలని, తాను ఆశావాదిని, సమాజాన్ని టీచర్లు నడపాలని ఈటెల పిలుపునిచ్చారు. తమకు మెరిట్ ఉందని..కొంత మంది మెరిట్ లేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

Similar News