ఏపీ హైకోర్టులోనూ అదే టెక్నాలజీ వాడిన నారాయణ

Update: 2019-09-18 14:46 GMT

గత సర్కారు వైభవాలను చెప్పే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చి కొత్తగా కట్టిన ఏపీ తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాల్లో భారీ వర్షాలు కురిస్తే చాలు...నీళ్ళు అన్నీ జర జరా భవనాల్లో కారటమే. భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఈ సీన్లు రిపీట్ అయ్యాయి. చంద్రబాబు సర్కారు ఘనత మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొత్తగా కట్టిన హైకోర్టు తాత్కాలిక భవనంలోనూ అదే సీన్. మాజీ మునిసిపల్ శాఖ మంత్రి, సీఆర్ డీఏ వ్యవహారాలను పర్యవేక్షించిన నారాయణ ఎక్కడైనా సరే నీళ్ళు కారే టెక్నాలజీని వాడినట్లు తాజా వర్షాలతో మరోసారి నిరూపితం అయింది. ఎవరైనా వర్షం కురవకుండా భవనాలు కట్టుకుంటారు. కానీ ఎంత కొత్త భవనం అయినా సరే వర్షం వస్తే నీరు రావాల్సిందే అన్న చందంగా ఈ కొత్త భవనాలు కట్టినట్లు కన్పిస్తోంది.

అమరావతిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు సర్కారు నిర్మించిన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి అతలాకుతలం అయిపోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాబీల్లోకి నీరు రావటంతో.. కూలర్లు అన్నీ బయట పడేసి.. సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయంలో కనిపించింది. ఈ విడత హైకోర్టు వంతు వచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం తరహాలోనే హైకోర్టు భవనంలోని పలు ఛాంబర్లలో సీలింగ్‌ నుంచి వర్షపు నీరు లీకైంది. దీంతో హైకోర్టు ఆవరణలోకి వచ్చిన వర్షపు నీటిని అక్కడ సిబ్బంది తోడి బయటపోశారు.

 

Similar News