అమరావతి..మళ్ళీ అదే సీన్

Update: 2019-08-29 15:44 GMT

అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష తర్వాత మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అయితే అదే సీన్. అమరావతిపై సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది. నిజంగా అక్కడ శాశ్వత భవనాలు కడతారా?. లేక అమరావతిలోనే వేరే ప్రాంతంలో కడతారా?. అన్న సస్పెన్స్ మాత్రం ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రం బొత్స ఎవరో ఏదో అనుకుంటే నాకేం సంబంధం అంటూ ప్రశ్నించారే తప్ప..అసలు విషయం తేల్చలేదు. అన్ని ప్రాంతాల అభివృద్దే తమ అభిమతమని, ఎవర్నీ నిర్లక్ష్యం చేయబోమని అన్నారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికో, వ్యక్తులకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, అన్ని జిల్లాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు.

ఇప్పటి వరకు జరిగిన పనులు, జరగాల్సిన వాటిపై మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణ పనులు 40 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సీఎంకు వివరించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. టెండర్ల దశలో ఉన్న పనులను రద్దు చేస్తున్నామన్నారు. ఆయా పనులకు నిధులు ఎలా వస్తాయి అనేది లేకుండానే టెండర్లు పిలిచారని వెల్లడించారు. చంద్రబాబు బంధువు రామారావు స్థలాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తెచ్చిన విషయాన్ని ఆయన జీవో ఆధారంతో సహా చూపించారు. 2012లో చేర్చినట్లు చెప్పడం అబద్దమేనని బొత్స అన్నారు. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి భూములు గురించి తాము చెప్పిన లెక్కలు వాస్తవమేనని అన్నారు. రాజధాని పరిధిలో ముంపు వ్యవహారంపై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన విలేకరులకు స్పష్టం చేశారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు.

 

Similar News