మరో వివాదంలో జగన్ సర్కారు..రాష్ట్రపతి ఆదేశాలు బేఖాతర్!

Update: 2019-08-14 16:18 GMT

ఏపీ సర్కారు చేస్తున్న రద్దుల పద్దులో ఇదో కొత్త వివాదం. ఈ ఏడాది జూలై 11న రాష్ట్రపతి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ) అడ్మిస్ట్రేటివ్ సభ్యుడిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పి. మల్లికార్జునరావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఐదేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు. అదే సమయంలో మల్లికార్జునరావుకు 2.25 లక్షల రూపాయల పేస్కేల్ ను కూడా ఈ ఆదేశాల్లో ప్రస్తావించారు. వాస్తవానికి ఏపీఏటీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం అవుతుంది. అయితే ఏపీ సర్కారు తాజాగా ఏపీఏటీని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కారు కొలువుదీరిన తర్వాత..కొత్త సభ్యుల నియామకం..వాళ్లు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ సర్కారు ఏపీఏటీని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం వల్ల న్యాయపరమైన చిక్కులు రావటంతోపాటు...రాష్ట్రపతి ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుందని భావిస్తున్నారు.

కాదు కూడదని..ఏపీ సర్కారు తన వైఖరితో ముందుకెళితే మరి రాష్ట్రపతి ఆదేశాలతో బాధ్యతలు స్వీకరించిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై వరస పెట్టి కేంద్రం పలు అభ్యంతరాలు లేవనెత్తుతూ వస్తోంది. విద్యుత్ ప్రాజెక్టుల పీపీఏలు పెద్ద దుమారం రేపగా..తాజాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు కూడా ఏపీ సర్కారు తీరును తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగినా...పనుల్లో జాప్యం జరిగినా అందుకు రాష్ట్ర పభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పీపీఏ స్పష్టం చేసింది. ఇవన్నీ ఓ వైపు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా..తాజాగా రాష్ట్రపతి ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరించటం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.

Similar News