అరుణ్ జైట్లీ కన్నుమూత

Update: 2019-08-24 07:26 GMT

బిజెపి అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. బిజెపి కీలక నేతలు అయిన సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు అతి తక్కువ వ్యవధిలో కన్నుమూయటం ఆ పార్టీ శ్రేణులను షాక్ కు గురిచేస్తోంది. అరుణ్ జైట్లీ వయస్సు 66 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేశాయి. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన మోడీ సర్కారు రెండవ సారి కొలువుదీరిన సమయంలో మంత్రివర్గంలో ఉండలేనని తన అసక్తతను వ్యక్తం చేశారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నా రికవరి కాలేకపోయారు. కిడ్నీ సమస్యలతోపాటు ఆయన క్యాన్సర్ తోనూ ఇబ్బందిపడుతున్నారు.

తొలి విడత మోడీ సర్కారులో ఆయన ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1952 డిసెంబర్ 28న అరుణ్ జైట్లీ జన్మించారు. వృత్తిరీత్యా ఆయన ప్రముఖ లాయర్ గా పేరు గాంచిన విషయం తెలిసిందే. విద్యార్ధిగా ఉన్న సమయంలో ఏబీవీపీలోనూ పనిచేశారు. 1974లో విశ్య విద్యాలయ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. వాజ్ పేయి మంత్రివర్గంలోనూ అరుణ్ జైట్లీ సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.2014 ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి లోక్ సభ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.

Similar News