చంద్రబాబు ఇంటిపై డ్రోన్ షూటింగ్..టీడీపీ అభ్యంతరం

Update: 2019-08-16 06:13 GMT

కృష్ణా నదికి వరద ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఇంటికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. కరకట్టలో ఆయన ఉంటున్న నివాసంలో వరద వస్తోంది. ఇసుక బస్తాలతో నివాసంలోకి నీరు రాకుండా సిబ్బంది ప్రయత్నాలు చేసినా అది పెద్దగా సఫలం అయినట్లు కన్పించలేదు. వరద ఉధృతి మరింత పెరిగితే మాత్రం చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతంలోకి కూడా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు కరకట్ట నివాసంలోకి నీటి ప్రవేశం విషయాన్ని డ్రోన్ కెమెరాతో షూట్ చేయటం దుమారం రేపుతోంది. అనుమతి లేకుండా ఇలా ఎలా చేస్తారంటూ టీడీపీ శ్రేణులు కరకట్ట వద్ద ఆందోళనకు దిగాయి.

టీడీపీ నేతలు టీడీ జనార్ధన్, దేవినేని అవినాష్ అక్కడకి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయమే ఈ ప్రాంతాన్ని సందర్శించి కరకట్ట నివాసంలోకి చంద్రబాబు సిబ్బంది అధికారులను అనుమతించకపోవటం సరికాదని అన్నారు. ఇది ప్రభుత్వ నివాసం అని ఆళ్ల వ్యాఖ్యానించారు. డ్రోన్ వాడకంపై చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. డీజీపీకి ఫోన్ చేసి హైసెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎలా ఉపయోగిస్తారంటూ ప్రశ్నించారు.

Similar News